బీటెక్ తర్వాత ఎటు?

* ఉన్నత చ‌దువులు...ఉద్యోగాలు
* ఎంపిక ఏదైనా ఆస‌క్తే ప్రధానం

ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ త‌ర్వాత ఉన్నట్టుగానే బీటెక్ అనంత‌రం ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. ఉద్యోగం దిశ‌గా అడుగులేయొచ్చు... ఉన్నత విద్యనూ కొన‌సాగించుకోవ‌చ్చు. అయితే గ‌మ్యమెటో నిర్ణయించుకోవాల్సింది మాత్రం విద్యార్థులే. బీటెక్ త‌ర్వాత వేసే అడుగు కెరీర్‌లో ఎంతో ముఖ్యమైంది. ఈ ద‌శ‌లో ఎవ‌రికి వారే నిర్ణయాలు తీసుకోవ‌డం ఉత్తమం. బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు, ఆస‌క్తులు, అభిరుచులు, అవ‌స‌రాలు...ఇవ‌న్నీ క‌చ్చితంగా బేరీజు వేసుకోవాలి. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. బాగా ఆలోచించి స‌రైన మార్గాన్ని ఎంచుకున్నవాళ్లే ఎందులోనైనా రాణించ‌గ‌ల‌రు.

దారులెన్నో...
బీటెక్ అనంత‌రం పై చ‌దువుల‌కు ఆస‌క్తిలేనివాళ్లు, ప‌రిస్థితులు అనుకూలించ‌నివారు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లో పాల్గొని ఏదైనా ఉద్యోగంలోకి చేరిపోవ‌డం తెలివైన నిర్ణయం. ఒక‌వేళ క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లో అవ‌కాశం ల‌భించ‌క‌పోతే ఆ బ్రాంచ్‌కి త‌గ్గ ఇత‌ర కోర్సులు పూర్తిచేసి వాటిద్వారా ఉద్యోగానికి ప్రయ‌త్నించాలి. కొన్నాళ్లు ఉద్యోగం చేసిన త‌ర్వాత చ‌దువుకోవాల‌నిపిస్తే పీజీ కోర్సుల్లో చేరొచ్చు. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాల‌నుకునేవాళ్లకు ప‌ని అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్పుడు చాలా వ‌ర‌కు పెద్ద కంపెనీల‌న్నీ విద్యాసంస్థల‌తో ఒప్పందాలు కుదుర్చుకుని ఉద్యోగుల‌కు ఆఫీస్ క్యాంప‌స్‌లోనే ఉన్నత చ‌దువులు చ‌దివిస్తున్నాయి. బిట్స్‌, విట్, ఐటీఎం, సింబ‌యాసిస్‌... లాంటి పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలు, బీ స్కూల్స్ ఎంఎస్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల‌ను కార్పొరేట్ ఉద్యోగుల‌కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాయి. ఉద్యోగానికి అంత‌రాయం లేకుండా వారాంతాల్లో త‌ర‌గ‌తులు, ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్, ఇ లెర్నింగ్‌ లాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఒకేసారి కొలువు, చ‌దువు రెండూ కొన‌సాగించుకోవ‌చ్చు.

ఎంటెక్‌...
టెక్నిక‌ల్‌గా మ‌రింత ప‌రిజ్ఞానం పొందాల‌ని కోరుకునే బీటెక్ విద్యార్థులు ఎంటెక్‌లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఎంటెక్‌+పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. గేట్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు పూర్తిచేసుకోవ‌చ్చు. గేట్ స్కోర్‌తో ఎంటెక్‌లో రెండేళ్లపాటు ప్రతినెలా రూ.12,400 స్టైపెండ్ కూడా అందుకోవ‌చ్చు. గేట్‌లో అర్హులు కానివాళ్లు పీజీఈసెట్ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరొచ్చు. అయితే బీటెక్‌లా కాకుండా ఎంటెక్ మాత్రం వీలైనంత‌వ‌ర‌కు మంచి కాలేజీలోనే చ‌ద‌వడానికి ప్రయ‌త్నించాలి. ఇలా జ‌రిగిన‌ప్పుడే ఆ పీజీకి విలువ పెరుగుతుంది. కేవ‌లం అర్హత కోస‌మే మొక్కుబ‌డిగా ఎంటెక్ పూర్తిచేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌న‌మూ ద‌క్కదు.

ఎంబీఏ...
కొంత‌మందికి మేనేజ్‌మెంట్ కోర్సుల‌వైపు ఆస‌క్తి ఉంటుంది వీళ్లు క్యాట్ ద్వారా ఐఐఎంల్లో ఉన్నత విద్యను అభ్యసించ‌వ‌చ్చు. ఎక్స్ఏటీ, ఎన్‌మ్యాట్‌, శ్నాప్ త‌దిత‌ర ప‌రీక్షల ద్వారా పేరున్న బీ స్కూళ్లలో ప్రవేశం ల‌భిస్తుంది. ప్రముఖ సంస్థల్లో పీజీడీబీఏ కోర్సు పూర్తిచేసిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మంచి అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో ఐఐఎంల్లో చేరే బీటెక్ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప‌లు కంపెనీలు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండి, మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌దివిన‌వాళ్లను ఉద్యోగాల‌కు ఎంపిక‌చేస్తున్నాయి.

విదేశీ విద్య...
బీటెక్ అనంత‌రం యూఎస్‌లో ఎంఎస్ లేదా ఎంబీఏ పూర్తిచేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లెంద‌రో ఉంటారు. ప్రస్తుతం యూఎస్ వెళ్లి ఎంఎస్‌, మేనేజ్‌మెంట్ కోర్సులు చ‌దివే భార‌తీయ విద్యార్థుల సంఖ్యా బాగా పెరుగుతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటాయే అధికం. విదేశాల్లో చ‌ద‌వాల‌నుకున్నవాళ్లంతా జీమ్యాట్‌, జీఆర్ఈ ప‌రీక్షలు రాయాలి. వీరంతా బీటెక్ మూడో సంవ‌త్సరంలో ఉన్నప్పుడే స‌న్నద్ధత‌ను ప్రారంభిస్తే కోర్సు పూర్తయ్యేస‌రికి మంచి స్కోర్ సాధించ‌డం తేలిక‌వుతుంది. లేదంటే బీటెక్ అనంత‌రం మ‌రో ఏడాదిపాటు ఆగాలి. పేరున్న యూనివ‌ర్సిటీల్లో సీటు ద‌క్కాలంటే మంచి స్కోర్ సాధించ‌డం త‌ప్పనిస‌రి. ప్రసిద్ధ యూనివ‌ర్సిటీల్లో ప్రమాణాలు మెరుగ్గా ఉండ‌డం వ‌ల్ల ప్రవేశాలూ అంతే క‌ఠినంగా ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ‌వ్యాప్తంగా పోటీ ఉంటుంది.

ఎంఎస్ ...ఎంబీఏ
ఈ రెండూ దేనిక‌వే ప్ర‌త్యేక‌మైన కోర్సులు. టెక్నిక‌ల్‌గా రాణించాల‌నుకునేవాళ్లు ఎంఎస్ కోర్సుల‌వైపు అడుగులేయ‌డం మంచిది. మేనేజ్‌మెంట్‌వైపు ఆస‌క్తి ఉంటేనే ఎంబీఏ దిశ‌గా క‌ద‌లాలి. ఎంబీఏ విష‌యానికొస్తే యూఎస్‌లో ప్రముఖ యూనివ‌ర్సిటీలు ప‌ని అనుభ‌వానికి ప్రాధాన్యమిస్తున్నాయి. భార‌త్‌లోనూ కొన్ని మేటి సంస్థలు ప‌ని అనుభ‌వాన్ని ప‌రిశీలిస్తున్నాయి. అయితే మ‌న‌దేశంలో ఎంబీఏ చ‌ద‌వ‌డానికి ప‌ని అనుభ‌వం త‌ప్పనిస‌రి అనే నిబంధ‌న మాత్రం లేదు.

భ‌ద్రమైన కెరీర్ కోసం...
ఇటీవ‌లి కాలంలో కెరీర్ భ‌ద్రత‌కు యువ‌త ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ప్రైవేటు రంగం అంత ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డ‌మూ ఒక కార‌ణ‌మే. దీంతో ప్రభుత్వోద్యోగాల కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎక్కువ‌గా ప్రయ‌త్నిస్తున్నారు. ఎక్కువ మంది సివిల్ స‌ర్వీసెస్‌పై మ‌క్కువ చూపుతున్నారు. కొంత‌మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌ను వ‌దులుకుని సివిల్స్‌ బాట‌ప‌డుతున్నారు. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో పోస్టుల‌కు సైతం ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీప‌డుతున్నారు. బ్యాంకులు, ఎస్ఎస్‌సీ, రైల్వే ఉద్యోగాల ఆశావ‌హుల్లోనూ బీటెక్ చ‌దివిన‌వాళ్లే ఎక్కువ మంది ఉంటున్నారు.

ఉద్యోగాలివీ....
బీటెక్ త‌ర్వాత చాలా ఉద్యోగాలే ఉన్నాయి. కేవ‌లం ఇంజినీరింగ్ అర్హత‌తోనే ఉన్న ఉద్యోగాలు కూడా త‌క్కువేమీ కాదు. ఆయా బ్రాంచ్‌ల్లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులంతా ఈ త‌ర‌హా ఉద్యోగాల కోసం ప్రయ‌త్నించ‌డం మేలు. వీటి ద్వారా దేశంలోనే అత్యున్నత అవ‌కాశాలను సొంతం చేసుకోవ‌చ్చు. బీటెక్ అర్హత‌తో ఉన్న ఉద్యోగాల్లో ముఖ్యమైన‌వి ఇవీ...

యూపీఎస్సీ ఐఈఎస్‌
చ‌దువుకున్న కోర్సుకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం చేయాల‌నుకునే బీటెక్ విద్యార్థుల‌కు యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ప‌రీక్ష ఒక చ‌క్కని వేదిక లాంటిది. ఈ ప‌రీక్షను ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన‌వాళ్లు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో రాణించ‌వ‌చ్చు. ఐఈఎస్ ప‌రీక్ష ద్వారా సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ బ్రాంచీలు చ‌దివిన‌వాళ్లకు ఎక్కువ అవ‌కాశాలు ల‌భిస్తాయి. దాదాపు సివిల్ స‌ర్వెంట్లకు ఉన్నంత ప్రాధాన్యం ఐఈఎస్ ద్వారా ఎంపికైన ఇంజినీర్లకు ఉంటుంది. మంచి హోదా, ఆక‌ర్షణీయ వేత‌నాలు, ప‌లు సౌక‌ర్యాలు సొంతం చేసుకోవ‌చ్చు. దేశం కోసం ప‌నిచేస్తున్నామ‌నే సంతృప్తినీ సొంతం చేసుకోవ‌చ్చు. త‌క్కువ వ్యవ‌ధిలోనే అత్యున్నత స్థాయిని అందుకోవ‌చ్చు. తిరుగులేని ఉద్యోగ భ‌ద్రత‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అయితే పోటీ కూడా తీవ్రమే.

ఎస్ఎస్‌సీ జేఈ
సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ విభాగాల్లో జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల‌ను ఎస్ఎస్‌సీ జేఈ ప‌రీక్ష ద్వారా భ‌ర్తీ చేస్తారు. స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ ఏటా ఈ ప‌రీక్షను నిర్వహిస్తుంది. ఎంపికైన‌వాళ్లు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియ‌ర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తారు.

ర‌క్షణ రంగంలోనూ...
యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్ఈలో నేవ‌ల్ అకాడెమీలోని ఖాళీల‌కు కేవ‌లం ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్లే అర్హులు.
ఇండియ‌న్ ఆర్మీలో టెక్నిక‌ల్ గ్రాడ్యుయేట్ కోర్సు ( టీజీసీ) ఇంజినీర్ పోస్టుల‌కు ఆయా బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్ చ‌దివిన‌వాళ్లే అర్హులు. ఎంపికైన‌వాళ్లకు లెప్టినెంట్ హోదా ద‌క్కుతుంది.
ఆర్మీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఆయా బ్రాంచ్‌ల్లో ఇంజినీర్ కోర్సులు చ‌దివిన‌వాళ్లే అర్హులు.
యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంజినీరింగ్ 3, 4 సంవ‌త్సరాల కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఈ విధానంలో ఎంపిక చేసిన కొన్ని క‌ళాశాల‌ల‌కు (తెలుగు రాష్ట్రాల్లో సీబీఐటీ ) వెళ్లి స్టాఫ్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఏడాదికి ఒక‌సారి మే లేదా జూన్‌లో క్యాంప‌స్ సెల‌క్షన్లు ఉంటాయి. అర్హత‌ సాధించిన‌వాళ్లు ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడెమీ (ఐఎంఏ) డెహ్రాడూన్‌లో ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభ‌మ‌వుతుంది.
నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో కూడా ప‌లు టెక్నిక‌ల్ విభాగాల్లో ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ఉద్యోగాలెన్నో ఉన్నాయి. ఏటా వీటికోసం ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ‌తాయి.

గేట్ స్కోర్‌తో...
మ‌హార‌త్న, న‌వ‌ర‌త్న, మినీర‌త్న లాంటి ప్రభుత్వ రంగ విభాగా ( పీఎస్‌యూ) ల్లో ఉద్యోగాల‌ను ఆశించిన‌వాళ్లు గేట్ రాయ‌డం త‌ప్పనిస‌రి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్ని పీఎస్‌యూలూ గేట్ స్కోర్ ద్వారానే ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నాయి. ఏడాదికి రూ.9 ల‌క్షల నుంచి 15 ల‌క్షల వ‌ర‌కు వేత‌నాన్ని అందిస్తున్నాయి. భార‌త్ పెట్రోలియం, ఇండియ‌న్ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, భెల్‌, హెచ్‌పీ..త‌దిత‌ర సంస్థలు గేట్ స్కోర్‌తో ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి.
ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేష‌న్ (ఇస్రో) కూడా సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల‌ను గేట్ స్కోర్‌తో భ‌ర్తీ చేస్తుంది. ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్ చ‌దివిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు.

రైల్వే, బీఎస్ఎన్ఎల్‌, బ్యాంకులు, ఏఏఐ
రైల్వేల్లో ఏటా జూనియ‌ర్ ఇంజినీర్‌, సీనియ‌ర్ సెక్షన్ ఇంజినీర్, చీఫ్ డిపోట్ మెటీరియ‌ల్ సూప‌రింటెండెంట్ పోస్టుల‌ను ఆర్ఆర్‌బీ టెక్ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల‌కు సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, ప్రొడ‌క్షన్ త‌దిత‌ర బ్రాంచ్‌ల్లో బీటెక్ చ‌దివిన‌వాళ్లు అర్హులు.

బీఎస్ఎన్ఎల్ ఏటా జూనియ‌ర్ టెలికాం ఆఫీస‌ర్ (జేటీవో) పోస్టుల కోసం ప్రక‌ట‌న విడుద‌ల‌చేస్తుంది. సివిల్, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌లు చ‌దివిన‌వాళ్లకు అవ‌కాశాలుంటాయి.

సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లు చ‌దివిన‌వాళ్లకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీస‌ర్ ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఐబీపీఎస్ ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజినీరింగ్ విద్యార్థులు మంచి అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల భ‌ర్తీకి ఏటా ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. మేనేజ‌ర్ (ఇంజినీరింగ్‌) పోస్టుల‌కు సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌ల్లో బీటెక్ చ‌దివిన‌వాళ్లు అర్హులు. అలాగే ఏటా ఈ సంస్థ జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీర్‌) పోస్టుల‌కు కూడా ప్రక‌ట‌న విడుద‌ల చేస్తుంది. ఆయా బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

బ్రాంచ్‌ల వారీ రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు.....
కొన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు చ‌దివిన‌వారికి రాష్ట్ర ప్రభుత్వంలోనూ కొలువులు ఉంటాయి. రాష్ట్రస్థాయిలో పోస్టుల‌న్నీ ఆయా రాష్ట్రాల‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ల ద్వారా భ‌ర్తీచేస్తారు.
సివిల్ ఇంజినీర్లకు రోడ్లు, భ‌వ‌నాలు; ప‌ంచాయ‌తీరాజ్ శాఖ‌ల్లో ఉద్యోగాలుంటాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్స్ విభాగంలో ఇంజినీర్ పోస్టుల‌ను బీటెక్ సివిల్‌, బీటెక్ ప్లానింగ్ అభ్యర్థుల‌తో భ‌ర్తీ చేస్తారు.
రూర‌ల్ వాట‌ర్ స‌ప్లై, శానిటేస‌న్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌, ప‌బ్లిక్ హెల్త్‌, మున్సిప‌ల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌ల్లో సివిల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సులు చ‌దివిన‌వాళ్లకు ఎక్కువ అవ‌కాశాలుంటాయి.
ప్రభుత్వ మోటార్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో వెహిక‌ల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల‌ను మెకానిక‌ల్ ఇంజినీర్‌, ఆటోమొబైల్ ఇంజినీర్ కోర్సులు చ‌దివివ‌వాళ్లతోనే భ‌ర్తీ చేస్తారు.
ప్రభుత్వ నీటిస‌ర‌ఫ‌రా విభాగాల్లో(హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ స‌ప్లై లాంటి చోట్ల) మేనేజ‌ర్ పోస్టుల‌కు సివిల్ ఇంజినీర్లకు ఎక్కువ అవ‌కాశాలుంటాయి. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌దివిన‌వారికీ ఈ విభాగంలో కొన్ని పోస్టులు ఉంటాయి.
ఎల‌క్ట్రిక‌ల్ ఇంజీనీర్లకు విద్యుత్ సంస్థలు, పంపిణీ బోర్డుల్లో అవ‌కాశాలు ల‌భిస్తాయి.

జ‌న‌ర‌ల్ ఉద్యోగాలు
ఈ ఉద్యోగాల‌కు ఏదైనా డిగ్రీ చ‌దివిన వాళ్లు పోటీ ప‌డొచ్చు. వీటికి కూడా ఏటా ప్రక‌ట‌న‌లు వెలువడుతుంటాయి. మూడేళ్ల సంప్రదాయ డిగ్రీ కోర్సులు చ‌దివిన‌వాళ్లతో క‌లిసి ఇంజినీరింగ్ విద్యార్థులు వీటికోసం పోటీ ప‌డాల్సి ఉంటుంది. జ‌న‌ర‌ల్ ఉద్యోగాల్లో ముఖ్యమైన‌వి...
యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్‌(ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌)
యూపీఎస్‌సీ కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్ఈ)
ఎస్ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌)
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేస‌న‌రీ ఆఫీస‌ర్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీ(ఐబీపీఎస్ ద్వారా నియామ‌కాలు)
ఎల్ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆపీస‌ర్ (ఏఏవో) పోస్టులు
ఎన్ఐసీ, యూఐఐసీఎల్‌, ఓఐసీఎల్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆపీస‌ర్ ( ఏవో) పోస్టులు
ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్‌, గూడ్స్‌గార్డు, రిజ‌ర్వేష‌న్ కం ఎంక్వైరీ క్లర్క్‌, టికెట్ క‌లెక్టర్‌
ఎయిర్ ఫోర్సు కామ‌న్ అడ్మిష‌న్ టెస్టు (ఏఎఫ్‌క్యాట్‌)
రాష్ట్రస్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు

స్వీయ‌ స‌మీక్షే కొల‌మానం
చ‌దువుకోవాల‌నే ఆస‌క్తి ఉండి, ఆర్థిక స‌మ‌స్యలు లేనివాళ్లు ఉన్నత చ‌దువులు దిశ‌గా అడుగులేయడ‌మే మంచిది. గేట్ స్కోర్‌తో పీఎస్‌యూల్లో అవ‌కాశాలు వ‌చ్చిన‌వాళ్లు మాత్రం ఉద్యోగానికే ప్రాధాన్యమివ్వొచ్చు. ఏదైనా అంశంలో ప్రత్యేక ప‌రిజ్ఞానం, సృజ‌న ఉన్న అభ్యర్థులు ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా రాణించ‌డానికి కృషిచేయ‌వ‌చ్చు. ఉద్యోగం, ఉన్నత చ‌దువు, వ్యాపారం ఏది చేయాల‌కున్న బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవ‌డం ముఖ్యం. స‌రైన నిర్ణయాలు తీసుకోవ‌డానికి స్వీయ‌స‌మీక్షను మించిన కొల‌మానం లేదు. న‌చ్చిన‌మార్గాన్ని అనుస‌రిస్తే మెచ్చిన అవ‌కాశాలు సొంత‌మ‌వుతాయి. ఆ దిశ‌గా అడుగులేయ‌డ‌మే ఇంజినీరింగ్ విద్యార్థుల క‌ర్తవ్యం. అలా చేస్తే విజ‌యం త‌థ్యం.

Posted on 28-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning