• బీటెక్‌లో వినూత్న కోర్సుల వెల్లువ

  * అందరి నోటా కృత్రిమ మేధ, బిగ్‌డేటా
  * అన్ని ప్రైవేట్‌ వర్సిటీలదీ అదే బాట
  * సంప్రదాయ కోర్సులకు భారీగా తగ్గనున్న డిమాండ్‌

  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో వచ్చే విద్యా సంవత్సరం బీటెక్‌ స్థాయిలో కొత్త కోర్సులు వెల్లువలా రానున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బ్లాక్‌ చైన్‌, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్సెస్‌, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌, వర్చువల్‌ రియాలిటీ లాంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు సైతం సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ‌లో ప్రస్తుతం బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ లాంటి కోర్సుల్లో అధిక సీట్లున్నా వాటిల్లో చాలా వరకు భర్తీ అవుతున్నాయి. సాధారణ కళాశాలల్లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు నిండుతున్నాయి. అందుకే ఈ విద్యా సంవత్సరమే (2019 - 20) రాష్ట్రంలో ఏడెనిమిది కళాశాలలు బీటెక్‌ కృత్రిమ మేధ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సులు ప్రారంభించాయి. మరికొన్ని కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో సీట్లు పెంచుకున్నాయి. వాటికి విద్యార్థుల నుంచి ఆదరణ లభించింది. కేంద్ర సర్కారు సైతం వచ్చే ఏడాది(2020-21) నుంచి ఆధునిక కోర్సులనే ప్రోత్సహిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
  ‘ప్రైవేటు’ కోర్సులు ఎన్నో... తెలంగాణ‌లో ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు ఇప్పటివరకు 12 విద్యాసంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో వచ్చే ఏడాది కనీసం అయిదారు తరగతులను ప్రారంభిస్తాయని అధికారులు చెబుతున్నారు. అందులో గురునానక్‌, మల్లారెడ్డి మహిళా, శ్రీనిధి (హైదరాబాద్‌), ఎస్‌ఆర్‌ వర్సిటీ (వరంగల్‌), వాక్సన్‌ (సదాశివపేట) తదితరాలు ఉన్నాయి. ఎక్కువగా స్పెషలైజేషన్‌ కోర్సులు ప్రవేశపెడతామని అవి నిపుణుల కమిటీకి వివరించాయి. ఇంజినీరింగ్‌తో పాటు బీఏ, బీకాం, బీఎస్‌సీలోనూ వినూత్న కోర్సులు ప్రతిపాదించాయి.
  * గురునానక్‌ వర్సిటీ బీటెక్‌ సీఎస్‌ఈలో కృత్రిమ మేధ, డేటా సైన్సెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోర్సులను, మెకానికల్‌లో 3డీ ప్రింట్‌ అండ్‌ డిజైన్‌, రోబోటిక్స్‌, ఈసీఈలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను ప్రవేశపెట్టనుంది.
  * ఎస్‌ఆర్‌ వర్సిటీలో బీటెక్‌ కృత్రిమ మేధ, బిగ్‌డేటా తదితర కోర్సులను ప్రవేశపెడతామని ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి మధుకర్‌రెడ్డి చెప్పారు. మిగిలిన వర్సిటీలూ ఇలాంటివే ప్రతిపాదించాయి.
  తగ్గనున్న మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ సీట్లు...
  కొత్త కోర్సుల నేపథ్యంలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు భారీగా తగ్గిపోతాయని నిపుణులు, కళాశాలల యజమానులు స్పష్టంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలైనా వెళుతున్నారు. కానీ, డిమాండ్‌ లేని కోర్సుల్లో చేరడానికి ఇష్టపడటం లేదని స్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌ కళాశాల అంటే సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ కోర్సులే అన్నట్లుగా మారిపోతోందని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం నేత డా.గౌతంరావు అభిప్రాయపడ్డారు. మొత్తానికి మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో కనీసం 30శాతం సీట్లు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

  అన్ని బ్రాంచీల్లోనూ కృత్రిమ మేధి

  * జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో బీటెక్‌ కోర్సులకు వర్తింపు
  * వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!

  ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మీరు బీటెక్‌లో చేరబోతున్నారా?..అయితే ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచీ ఎంపిక చేసుకున్నా కృత్రిమ మేధ (ఏఐ) సబ్జెక్టు చదవాల్సిందే. సమీప భవిష్యత్తులో ఏఐ దూసుకురాని రంగం ఉండదని నిపుణుల అంచనా. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రతి బీటెక్‌ బ్రాంచీలో ఈ సబ్జెక్టును బోధించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. తెలంగాణ‌ రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ జులై నుంచి జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి ఉపకులపతిగానూ వ్యవహరిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలకు అవకాశం లేకుండా ఇప్పటికే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయించారు. తాజాగా ఇంజినీరింగ్‌ సిలబస్‌పై దృష్టి సారించిన ఆయన ఇటీవల జరిగిన వర్సిటీ అధికారుల సమావేశంలో ఇప్పటి మార్కెట్‌ అవసరాలు, మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మారాలని అభిప్రాయపడ్డారు. అన్ని బీటెక్‌ విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2020 - 21) నుంచి దాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.
  ఒక క్రెడిట్‌ కోర్సుగా అమలు
  బీటెక్‌ స్థాయిలో ప్రతి విద్యార్థి కృత్రిమ మేధ గురించి కనీసం తెలుసుకోవాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలోనే దీనిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడానికి ఒక క్రెడిట్‌ కోర్సుగా అమలు చేస్తారు. ఏఐని అర్థం చేసుకొని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంటెక్‌లో ప్రత్యేక కోర్సులో చేరేందుకు వీలవుతుందని వర్సిటీ భావిస్తోంది. దీనిపై అకడమిక్‌ సెనెట్‌ సమావేశంలో చర్చించి తుది ఆమోదం తీసుకుంటారు. వచ్చే ఏడాది (2020 - 21) నుంచి జేఎన్‌టీయూహెచ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఐటీ) ఎంటెక్‌ డేటా సైన్స్‌ అనే రెండేళ్ల పీజీ కోర్సును ప్రారంభించనుంది.

  సంకల్పం మీది.. సాయం మాది

  * అంకురాలకు ఇది స్వర్ణయుగం
  * సాంకేతిక, ఆర్థిక సహకారం చేస్తాం
  * పేటెంట్లు ఉచితంగా ఇప్పిస్తాం
  * 5000 టెక్నాలజీలు... 2000 పేటెంట్లు
  * ఈనాడు ముఖాముఖిలో ఎన్‌ఆర్‌డీసీ సీఎండీ పురుషోత్తం

  ఈనాడు - హైదరాబాద్‌: వ్యాపారవేత్తలు కావాలనుకునే వారికి సాంకేతికంగా, ఆర్థికంగా అండగా ఉండేందుకు జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌డీసీ) సిద్ధంగా ఉంది. అలాంటి వారికి ఉబర్‌, ఓలా లాంటిది మా సంస్థ’ అని ఎన్‌ఆర్‌డీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌.పురుషోత్తం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఆర్‌డీసీ వద్ద ఉన్న కోట్ల రూపాయల తోడ్పాటు నిధిని ఉపయోగించుకోవాలని కోరారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...
  * సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలలు, భారతీయ వైద్య పరిశోధన మండలి, భారత వ్యవసాయ పరిశోధన మండలి సహా విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాలు ఎన్‌ఆర్‌డీసీలో భాగస్వాములు. వీటిలో సామాజిక సమస్యలకు పరిష్కారంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ ఫలితాలను ప్రజలకు చేరువ చేయడం మా ప్రధాన కర్తవ్యం.
  * అంకుర సంస్థలకు ప్రభుత్వం చాలా మౌలిక సదుపాయాలు కల్పించింది. విధానపరమైన మద్దతు ఉంది. రూ.10 వేల కోట్ల స్టార్టప్‌ మిషన్‌ ఫండ్‌ ఉంది. రెండువేల కోట్ల రూపాయలతో క్రెడిట్‌ గ్యారంటీ స్కీం ఫండ్‌ ఉంది.
  * ఎన్‌ఆర్‌డీసీకి ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఉన్నాయి. స్టార్టప్‌ల ఇంక్యుబేషన్‌ సెంటర్లతో మేం అనుసంధానం చేస్తాం. మా వద్ద రూ.60 కోట్లతో ఐఓసీఎల్‌ స్టార్టప్‌ ఫండ్‌ ఉంది. దీని లక్ష్యం అంకుర సంస్థలను ప్రోత్సహించడం. మాకు 800 దరఖాస్తులు రాగా 24 అంకురాలను ఎంపిక చేసి వాటికి కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల గ్రాంట్‌ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం.
  * స్టార్టప్‌ పోర్టల్‌ డీపీఐఐటీలో నమోదు చేసుకుంటే పరిశీలించి తోడ్పాటు అందిస్తాం. స్టార్టప్‌ ఇండియా ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత అంకుర సంస్థలు బాగా పెరిగాయి. దిల్లీ, ముంబయి. బెంగళూరు వాళ్లే ఎక్కువగా ముందుకొస్తున్నారు. దక్షిణాదిలోని ఇతర ప్రాంతాల వారు తక్కువగానే ఉపయోగించుకుంటున్నారు.
  * అంకుర కంపెనీలకు కాన్సెఫ్ట్‌ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకుని వ్యాపారాలను ప్రారంభించవచ్చు. మా వద్ద స్టార్టప్‌లు, పరిశోధనలకు, ప్రొటోటైప్‌ ఫండింగ్‌, మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఫండ్స్‌, కమర్షియలైజేషన్‌కు ఫండ్స్‌ ఉన్నాయి.
  * మమ్మల్ని సంప్రదిస్తే పేటెంట్‌లు ఉచితంగా ఫైల్‌ చేస్తాం. పేటెంట్‌ క్లెయిమ్‌ చేయాలంటే రూ. 4 - 5 లక్షల ఖర్చవుతుంది. అదంతా మేమే భరిస్తాం. ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్‌ఎస్‌సీసీఐ సహా ఇతర అనుమతులకు మేం సహకరిస్తాం.
  * వ్యాపారవేత్తగా మారాలనుకునేవారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఉద్యోగాలే లక్ష్యంగా కాకుండా వ్యాపారవేత్తలుగా మారాలి. ఏ దశలో వచ్చినా మేం మద్దతు ఇస్తాం.
  * సాంకేతికత, నిధులతో పాటు పూర్తి వ్యాపార ప్రణాళిక ఇస్తాం. కమర్షియల్‌ ప్లాంట్‌ కోసం నిధులు కూడా అందిస్తాం. అవసరమైతే మా తరఫున కొంత పెట్టుబడి పెడతాం. లేదంటే ఇతర ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేస్తాం. చాలా మంత్రిత్వ శాఖల్లో నిధులు అందుబాటులో ఉన్నాయి.
  * ఎన్‌ఆర్‌డీసీ పదేళ్లలో 5000 టెక్నాలజీలను లైసెన్స్‌ చేసింది. 2000 పేటెంట్లు ఫైల్‌ చేసింది. దిల్లీ, జైపూర్‌లలో ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఉన్నాయి. దేశంలోని అన్ని సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోజుకో సాంకేతికతను బదలాయించడం మా లక్ష్యం.
  * 20 హెచ్‌పీ ట్రాక్టరు, పోలింగ్‌ సమయంలో వాడే ఇంకు, కృత్రిమ గుండె వాల్వుల తయారీ కూడా ఎన్‌ఆర్‌డీసీ సాంకేతికతలే. వాల్వు ధర దిగుమతి వ్యయంలో మూడో వంతుకు తగ్గింది. ఎన్‌ఆర్‌డీసీ 24 దేశాలకు సాంకేతిక తోడ్పాటు అందిస్తోంది. ఆఫ్రికన్‌ దేశాలు సహాయం కోరుతున్నాయి. ఘనాలో టమాటా పండించడం నేర్పించాం.
  * ఎన్‌ఆర్‌డీసీని వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. మా ప్రధాన కేంద్రం దిల్లీ. విశాఖపట్నంలోనూ కార్యాలయం ఉంది.

  ఇంజినీరింగ్‌ పరిశోధన ఓ గొప్ప అవకాశం

  * ఐటీ పరిశ్రమకు, విద్యార్ధులకు మేలు
  * మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గిరాకీ
  * పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు
  * ‘ఈనాడు’తో క్వెస్ట్‌ గ్లోబల్‌ ఉపాధ్యక్షుడు పియూష్‌ జైన్‌

  ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పరిశోధన-అభివృద్ధి (ఇ-ఆర్‌డీ) మన దేశంలోని ఐటీ రంగానికి సమీప భవిష్యత్తులో అతి పెద్ద వ్యాపారావకాశమని అంటున్నారు క్వెస్ట్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు పియూష్‌ జైన్‌. ఈ విభాగంలో విస్తరించాలనుకునే ఐటీ కంపెనీలకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ విభాగంలో తాము వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించనున్నామని తెలిపారు. అక్టోబ‌రు 18న‌ హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. విశేషాలు:
  * ఐటీ పరిశ్రమకు సమీప భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ పరిశోధన-అభివృద్ధి విభాగం అతిపెద్దదిగా ఆవిర్భవించనుందని పరిశ్రమ వర్గాల అంచనా. దీన్లో అవకాశాలు ఏమిటి.. వాటిని అందిపుచ్చుకోవటం ఎలా
  ఈ విభాగంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఇది 2025 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ‘నాస్‌కామ్‌’ అంచనా. అప్పటికి పది లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ రంగం వేగంగా విస్తరిస్తోందనటానికి ఇదే ఉదాహరణ. మనం ఇప్పుడు ‘కనెక్టెడ్‌’ ప్రపంచంలో ఉన్నాం. ఐఓటీ, ఆటోమేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌... వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులకు తావిస్తోంది. దేశీయ ఐటీ పరిశ్రమ ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ సేవల్లో నిమగ్నమై ఉంది. దీనికే పరిమితం అయితే సరిపోదు. సంక్లిష్ట నైపుణ్యాలు అవసరమైన ఇంజినీరింగ్‌ పరిశోధన-నూతన ఉత్పత్తుల ఆవిష్కారంపై దృష్టి సారించాలి. మనదేశంలోని ఐటీ పరిశ్రమకు ఇదో మంచి వృద్ధి అవకాశం. అదే విధంగా భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనలోనూ ఈ విభాగం క్రియాశీలకంగా ఉండబోతోంది. ముఖ్యంగా మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గిరాకీ లభిస్తుంది.
  ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి
  ప్రధానంగా మానవ వనరుల లభ్యతే సమస్య. ఇంజినీరింగ్‌ డిజైన్‌, పరిశోధనలపై అవగాహన, నైపుణ్యాలు కలవారు కావాలి. కేవలం ఇంజినీరింగ్‌తోనే సరిపెడితే సరిపోదు. కొన్ని ప్రత్యేకమైన టూల్స్‌ నేర్చుకోవాలి. పరిశోధనా నైపుణ్యాలు సాధించాలి. ఆ దిశగా ఐటీ పరిశ్రమ కూడా ప్రయత్నాలు చేయాలి. ఉదాహరణకు మా సంస్థలో చేరిన ఇంజినీర్లకు ఒక నెల నుంచి మూడు నెలల వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తాం. వారి వారి నైపుణ్యాలను బట్టి ఎటువంటి శిక్షణ కావాలో గుర్తించి ఇంజినీర్లను తీర్చిదిద్దుతున్నాం. ఇదే విధంగా కొన్ని ఎంపిక చేసిన ఇంజినీరింగ్‌ కాలేజీలతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్ధిగా ఉండగానే కొన్ని విభాగాల్లో వారిని సమర్థులుగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటువంటి కసరత్తును పరిశ్రమ తరఫు నుంచి పెద్దఎత్తున చేపడితే ఇ-ఆర్‌డీ విభాగంలో మనదేశం అగ్రగామిగా ఎదిగే వీలుకలుగుతుంది.
  క్వెస్ట్‌ గ్లోబల్‌ ఏయే విభాగాల్లో క్రియాశీలకంగా ఉంది
  ప్రధానంగా ఇ-ఆర్‌డీ, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఆటోమేషన్‌- డిజిటైజేషన్‌ విభాగంలో మేం భారీగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థలో 12,500 మంది ఇంజినీర్లు ఉంటే, ఇందులో 7,000 మంది భారత్‌లోనే ఉన్నారు. బెంగళూరు, త్రివేండ్రం మా అతిపెద్ద కేంద్రాలు. ఇంకా బెల్గాం, పుణె, భువనేశ్వర్‌, హైదరాబాద్‌లలో కేంద్రాలు ఉన్నాయి. ఏటా 60కోట్ల డాలర్ల ఆదాయాలు నమోదు చేస్తున్నాం. ఇందులో భారత్‌ నుంచి 15%ఆదాయాలు సమకూరుతున్నాయి.
  హైదరాబాద్‌ కేంద్రంలో ఎటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నారు
  గత ఏడాదే ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. 150 మంది ఇంజినీర్లు ఉన్నారు ఇప్పుడు. వచ్చే రెండేళ్లలో ఇక్కడి ఇంజినీర్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనేది మా ప్రణాళిక. ప్రధానంగా ఇక్కడ ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌వేర్‌, కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చేస్తున్నాం.
  ఇంజినీరింగ్‌ విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంపొందించటానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు
  తిరువనంతపురంలో మాకు ‘క్వెస్ట్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ఉంది. దీని ద్వారా మేం ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలను ఎంపిక చేసుకొని అక్కడ విద్యార్ధులకు నూతన ఐటీ నైపుణ్యాల్లో ముందస్తుగా శిక్షణ ఇస్తునాం. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయశ్రేణి నగరాలు/ పట్టణాల్లో కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలను గుర్తించి ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యాం. త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుంది. గ్రామీణ/ సెమీఅర్బన్‌ ప్రాంతాల్లోని విద్యార్ధులకు తగిన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. తద్వారా స్థానికంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు తోడ్పాటు ఇచ్చినట్లు అవుతుంది.
  ప్రస్తుతం దేశంలో ఏ రంగాన్ని చూసినా మందగమనం మాట వినవస్తోంది. ఐటీ రంగానికి ఇటువంటి సమస్య లేదు. పైగా వృద్ధి నమోదవుతోంది. ఐటీ రంగం అభివృద్ధికి ఏ పరిణామాలు దోహదపడుతున్నాయి
  ప్రధానంగా బహుళ జాతి ఐటీ కంపెనీలు మనదేశంలో అభివృద్ధి కేంద్రాలు స్థాపించటం, ఇక్కడి నుంచి ఐటీ కార్యకలాపాలు నిర్వహించటం కనిపిస్తోంది. దీనికి తోడు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఇంజినీరింగ్‌ పరిశోధన, ఆటోమేషన్‌, ఐఓటీ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి దేశీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు లభిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం- మానవ వనరుల లభ్యత. మనదేశంలో ఐటీ నిపుణుల లభ్యత అధికంగా ఉండటం ఐటీ రంగం విస్తరణకు వీలుకల్పిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు సంపాదించుకోగలిగితే ఐటీ రంగలో మన ప్రగతికి ఇబ్బందేమీ ఉండదు.

  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆధునిక సాంకేతికత

  ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సాధారణ కోర్సులతోపాటు ఆధునిక సాంకేతికతపై బహుళ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెమికండక్టర్, సిస్టమ్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ రెడ్‌ఫైన్‌ సిగ్నల్స్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్‌ సమక్షంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సాంకేతిక విభాగం సీజీఎం రవికుమార్, రెడ్‌ఫైన్‌ సిగ్నల్స్‌ ప్రతినిధి దివాంజన్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ట్రిపుల్‌ఐటీ నూజివీడు, ఇడుపులపాయ, జేఎన్టీయూ అనంతపురం, కాకినాడల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లెర్నింగ్, ఎడ్జ్‌ ఇంటెలిజెన్స్, ఐవోటీ శిక్షణ ఇవ్వనున్నారు.

  ఆశేనా.. ఆ శక్తి ఉందా?

  * విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేందుకు బీటెక్‌కు ముందు ఆప్టిట్యూడ్‌ పరీక్ష!
  * కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు

  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముందుగా ఆప్టిట్యూడ్‌ టెస్టును నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ యోచిస్తోంది. సహ విద్యార్థులు చేరుతున్నారనో.. తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టం లేకున్నా.. తగిన శక్తి సామర్థ్యాలు లేకున్నా బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు చాలామంది. కొందరైతే మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని నివారించడానికే ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్ష నిర్వహణను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ)కు అప్పగించాలని భావిస్తోంది. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో.. అందుకు ఎటువంటి నైపుణ్యాలు అవసరమో సరైన మార్గదర్శకం చేసే పరిస్థితి లేక విద్యార్థులు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ఇంజినీరింగ్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి సిద్ధపడుతున్నారు. లక్షలమంది ఏదో చేరాం కదాని ఏదోకవిధంగా చదువును పూర్తి చేస్తున్నారే తప్ప నైపుణ్యం సాధించలేకపోతున్నారు. ఫలితంగా ప్రాంగణ నియామకాల్లో 40 శాతంమందే ఎంపికవుతున్నారు. వేలాదిమంది విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తున్నారు. చాలామంది ఆ కోర్సుకు తగిన నైపుణ్యం సాధించలేక.. ఎలాగో పూర్తిచేసి చిన్నచిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. లేకపోతే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కోర్సులో చేరేముందు ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
  ఎగ్జిట్‌ పరీక్షకు బదులు
  బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఇంజినీరుకు కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదని, అందుకే చదువు పూర్తయిన తర్వాత ఎగ్జిట్‌ పరీక్ష నిర్వహించాలని, అందులో ఉత్తీర్ణులైతేనే డిగ్రీ పట్టా ఇవ్వాలని గత ఏడాది నుంచి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. కాని దీనిపై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చాయి. నాలుగేళ్లు చదివిన తర్వాత మీకు నైపుణ్యాలు లేవని అంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమైనట్లు కాదా? అన్న ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో కోర్సులో ప్రవేశించడానికి ముందే ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులే తాము ఇంజినీరింగ్‌ రంగంలో రాణించగలుగుతామో.. లేదో నిర్ణయించుకుంటారని, ఒకవేళ శక్తిసామర్థ్యాలు లేకుంటే మరో కోర్సులో చేరతారన్నది నిపుణుల అభిప్రాయం. దాంతో ఈ దిశగా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.
  మరిన్ని కోర్సులకు?
  మొదట ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులకు ఆప్టిట్యూడ్‌ పరీక్ష వర్తింపజేసినా తర్వాత పలు కోర్సులకు కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  నిపుణుల వ్యాఖ్య చాలా అవసరం - ఆచార్య కామాక్షిప్రసాద్‌, జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం సంచాలకుడు
  ‘‘ఇలాంటి పరీక్ష ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అవసరం. ప్రస్తుతం ఎంతోమంది ఆసక్తి లేకున్నా.. అందరూ ఇంజినీరింగ్‌లో చేరుతున్నారని చేరేవాళ్ల శాతం తక్కువేమీ కాదు''

  ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నియామకాల సందడి

  * వేతనాల్లో 10 - 20 శాతం పెంచిన కొన్ని ఐటీ కంపెనీలు
  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐటీ పరిశ్రమలు శుభవార్త మోసుకొస్తున్నాయి. కళాశాలలకు ప్రాంగణ నియామకాల కోసం వస్తున్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు ఈ ఏడాది వార్షిక వేతనం మొత్తాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆ విషయాన్ని ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మరికొన్ని సెప్టెంబరులో నియామకాలకు వస్తామని కళాశాలలకు మౌఖికంగా సమాచారం ఇచ్చాయి. పలు సంస్థలు వేతనం పెంచుతున్నా చెబుతున్నారు. రాష్ట్రంలో జులై నెలాఖరులో కొన్ని ఐటీ కంపెనీలు ప్రాంగణ నియామకాలను ప్రారంభించాయి. కాలానుగుణంగా ఐటీ పరిశ్రమకు అవసరమైన వారిని ఎంపిక చేసుకునేందుకు కొత్తగా కోడింగ్‌ పరీక్షలు జరుపుతున్నాయని ప్రాంగణ నియామకాల అధికారులు గత ఏడాది కంటే ఈసారి వేతనపరంగా ఇవి ఆశాజనకంగా ఉన్నాయని కళాశాలల వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. గత ఏడాదే కొన్ని కంపెనీలు స్వల్పంగా ప్యాకేజీని పెంచాయి. ఈ సంవత్సరం కూడా పెంచుతున్నాయి. అయితే కొత్తగా వచ్చిన డిజిటల్‌ టెక్నాలజీపై పనిచేసే వారి కోసం ఎక్కువ అన్వేషిస్తున్నాయని, వేతనం మొత్తాన్ని పెంచినా ఎంపిక చేసుకునే వారి సంఖ్యను పెంచకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎంపిక చేసుకోగానే పెద్దగా శిక్షణ లేకుండా పనిచేసే వారికి పరిశ్రమలు ప్రాధాన్యం ఇస్తున్నాయని, అందుకే కొంత వరకు వేతనాన్ని పెంచుతున్నాయని వాసవి కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్‌ చెప్పారు. ఈసారి 20-30 నిమిషాలపాటు కోడింగ్‌ పరీక్ష నిర్వహిస్తున్నాయన్నారు.
  * ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ కంపెనీలు గత ఏడాది రూ. 3.60 లక్షలు, రూ. 3.70 లక్షల వరకు ఇవ్వగా ఈసారి దాన్ని రూ. 4 లక్షలకు పెంచుతామని మౌఖికంగా కళాశాలలకు సమాచారం ఇచ్చాయని ప్రాంగణ నియామకాల అధికారులు చెప్పారు. ఈ పరిశ్రమలు సెప్టెంబరులో నియామకాలకు రానున్నాయి.
  * డెలాయిట్‌ గత సంవత్సరం వరకు రూ. 6.20 లక్షల వరకు ఇవ్వగా ఈసారి రూ. 7.60 లక్షల వరకు ఇస్తోందని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి పార్థసారథి చెప్పారు. అంటే దాదాపు 19 శాతం పెరిగింది.
  * ఎల్‌ అండ్‌ టీ ఇంతకుముందు రూ. 3.5 లక్షల వరకు ఇవ్వగా ఈసారి రూ. 5 లక్షల వరకు ఇస్తోంది. ఇంకా పలు కంపెనీలు వార్షిక వేతనాన్ని పెంచుతున్నాయి.
  కంప్యూటర్‌ కోడింగ్‌లోప్రతిభను గుర్తించేందుకు పలు ఐటీ సంస్థలు ఆన్‌లైన్‌ కోడింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నాయి. వాటిలో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసుకునేందుకు ఈసారి కొన్ని కంపెనీలు ముందుగానే ప్రాంగణ నియామకాలు చేపట్టడం గమనార్హం. ఆటోమేషన్‌ వైపు పరిశ్రమ మారుతున్నందున అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ తదితరాల్లో నైపుణ్యం ఉంటే ఎంతైనా ఇచ్చేందుకు పరిశ్రమలు పోటీపడుతున్నాయని, అందుకే ముందుగా వచ్చి ఎంపిక చేసుకుంటున్నాయని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. కళాశాలలకు మొదట వచ్చేది అధిక వేతనాలిచ్చే ప్రొడక్ట్‌ కంపెనీలే. అవి కొత్త సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, ఐబీఎం, పెగా సిస్టమ్స్‌ లాంటివి. ఇలాంటి పరిశ్రమలు తక్కువమందిని ఎంపిక చేసుకుంటాయి. తర్వాత ఆసాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకునేసర్వీస్‌కంపెనీలు ప్రాంగణ నియామకాలు జరుపుకొంటాయి. అవి అధిక సంఖ్యలో అభ్యర్థులనుతీసుకుంటాయి.ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ లాంటివి ఈ కోవలోకే వస్తాయి. టీసీఎస్‌ డిజిటల్‌ టెక్నాలజీలో పనిచేసే వారిని ఎంపికచేస్తూ అధిక వేతనం అందిస్తోంది. అందుకు డిజిటల్‌ పేరిట ఆన్‌లైన్‌ పరీక్షలు జరిపింది.

  ఉద్యోగాలకు అనువుగా శిక్షణ

  * పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం
  * ‘ఈనాడు’తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి

  ఈనాడు, అమరావతి: పరిశ్రమల అవసరాలకు అభ్యర్థుల నైపుణ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 6న‌ జయవాడలోని తన కార్యాలయంలో ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. జిల్లాలవారీగా ఎక్కడ ఏ పరిశ్రమకు ఎంతమంది ఉద్యోగులు కావాలి? ఎలాంటి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరమనే వివరాలను జిల్లా కలెక్టర్లు, పరిశ్రమల శాఖల నుంచి సేకరిస్తామన్నారు. వారి అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామని వెల్లడించారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల అభిప్రాయాలూ స్వీకరిస్తామని తెలిపారు.
  లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్రాలు
  రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే వీటిని ఏర్పాటు చేస్తాం. సీఎంను సంప్రదించి, ఆయన సూచన మేరకు మార్గదర్శకాలు రూపొందిస్తాం.
  ప్రొద్దుటూరులో కేపీసీ శిక్షణ కేంద్రం
  కేసీపీ కంపెనీతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఈ సంస్థ ప్రొద్దుటూరులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ చదివిన వారికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పెద్ద వాహనాల డ్రైవింగ్‌, హౌస్‌కీపింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల మరమ్మత్తుల్లో శిక్షణ ఇస్తారు. నెల నుంచి మూడు నెలల వరకు శిక్షణ ఉంటుంది. చాలా వరకు ఉద్యోగాలను ఆ సంస్థే కల్పిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ, కేసీపీ సంయుక్తంగా ధ్రువీకరణ పత్రాలను ఇస్తాయి. ఇవి ఎక్కడైనా ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడతాయి.
  ట్రిపుల్‌ఐటీ, జేఎన్‌టీయూ విద్యార్థులకు
  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కృత్రిమ మేధ‌స్సు, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు రెడ్‌పైన్‌ సిగ్నల్స్‌ సంస్థతో ఒప్పంద చేసుకోవాలని భావిస్తున్నాం. ట్రిపుల్‌ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురంలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. బీటెక్‌ మూడో డాది రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నాం. మొదటి విడతలో ఒక్కో బ్యాచ్‌కు 50 మంది వంతున విద్యార్థులకు ఈ సాంకేతికతను నేర్పించనున్నాం.

  10 లక్షల మంది భారత విద్యార్థులకు సిస్కో శిక్షణ

  కోచి: భారత్‌లో డిజిటల్‌ నైపుణ్యాలపై 2025 నాటికి 10 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా నెట్‌వర్కింగ్‌ దిగ్గజ సంస్థ సిస్కో ప్రకటించింది. సిస్కో నెట్‌వర్కింగ్‌ అకాడమీ ద్వారా.. ఇప్పటికే 3.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంపెనీ శిక్షణ ఇచ్చింది. ‘2020 నాటికి 2.5 లక్షల మందికి శిక్షణ ఇస్తామని 2016లో ప్రకటించాం. అయితే ఏడాది ముందే దాన్ని సాధించాం’ అని సిస్కో ఎస్‌వీపీ-ఐటీ, సీఐఓ ఇంటర్నేషనల్‌ వీసీ గోపాలరత్నం పేర్కొన్నారు. అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమం కింద స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఓకేషనల్‌ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సిస్కో అభివృద్ధి చేసిన పాఠ్యాంశాలను అందిస్తారు.

  ఆరు నెలల్లో 500 ఉద్యోగాలు

  * హైదరాబాద్‌లో సునేరాటెక్‌ మూడో కేంద్రం
  ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సునేరాటెక్‌ హైదరాబాద్‌లో తన మూడో కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడి నుంచి క్లౌడ్‌, బ్లాక్‌చైన్‌, ఐఓటీ, మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ, డిజిటల్‌ తదితర అంశాలపై అంతర్జాతీయంగా ఉన్న కేంద్రాలకు సహకారాన్ని అందించనుంది. హైదరాబాద్‌లోని దివ్యశ్రీ ఓరియన్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈ నూతన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీని దాదాపు 50,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునేరాటెక్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ రవి రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో ప్రధానంగా డేటా సైటింస్ట్‌లు, డేటా అనలిస్టులను నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల్లో 500 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న రెండు కేంద్రాల్లో 1,100 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 2020 చివరి నాటికి 1,000-1,500 మందిని కొత్తగా తీసుకోబోతున్నట్లు తెలిపారు. అప్పటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,500 మందికి చేరుతుందని, ఇందులో 2,200 మంది వరకూ హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తారని చెప్పారు. ఏడాదిలోగా మరో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 6,000 వరకూ ఉద్యోగులను తీసుకుంటామని వెల్లడించారు. ఒరాకిల్‌తో కలిసి క్లౌడ్‌ పార్ట్‌నర్‌గా మొదటి స్థానంలో కొనసాగుతున్నామనీ, ఇతర క్లౌడ్‌ వేదికల్లోనూ మొదటి స్థానానికి చేరేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పలు పెద్ద సంస్థలు తమ డేటా కేంద్రాలను క్లౌడ్‌లోకి మార్చేందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

  భారతీయ నిపుణ @ అమెరికా

  * 70 శాతం హెచ్‌-1బీ వీసాలు మనోళ్లకే
  * అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకే..

  ఈనాడు - హైదరాబాద్‌: అమెరికా ప్రభుత్వం నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల్లో 70శాతం వరకు భారతీయులకే దక్కుతున్నాయి. కొన్నేళ్ల నుంచి భారతీయ నిపుణులకు దక్కే ఈ వీసాల వాటా పెరుగుతూ వస్తోంది. వాటిని పొందేవారిలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ సేవలను అందిస్తుండటం.. ఆ రంగంలోని నిపుణులు భారత్‌లోనే అధికంగా ఉండటంతో హెచ్‌-1బీ వీసాలు ఎక్కువగా వారికి దక్కుతున్నాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ వీసాల జారీలో ఒక్కో దేశానికి గరిష్ఠంగా 15శాతానికి మించి ఇవ్వరాదన్న ప్రతిపాదన ఇటీవల వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.
  ఎందుకు ఈ వీసాలు?
  అమెరికాలో కంపెనీలు.. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువ. వాటికి అవసరమైన నిపుణులు అక్కడ లేనందున ఇతర దేశాలకు చెందిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. అందుకు ముందుగా హెచ్‌-1బీ వీసా కోసం ప్రభుత్వానికి ఆ కంపెనీలు దరఖాస్తు చేస్తాయి. దీన్ని తాత్కాలికంగా ఆ దేశంలో పనిచేయడానికి ఇచ్చే వీసాగా చెప్పొచ్చు. కంపెనీల ద్వారా అందిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.
  చదువు.. ఉద్యోగం అక్కడే
  భారత్‌లో ఏటా బీటెక్‌ పూర్తి చేస్తున్న 7-8 లక్షల మందిలో దాదాపు 50 వేల మంది వరకు అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు వెళ్తున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 30 శాతం వరకు ఉంటుందని అంచనా. వారిలో కూడా అక్కడ 80 శాతం వరకు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగే పూర్తిచేస్తారు. అక్కడ రెండేళ్లపాటు చదివిన తర్వాత మూడేళ్లపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ద్వారా కంపెనీల్లో ఉద్యోగం చేయవచ్చు. ఆ లోపు హెచ్‌-1బీకి దరఖాస్తు చేసుకుంటారు. వస్తే అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. భారతీయ విద్యార్థులు.. వీసా రాకుంటే చాలా మంది తక్కువ రుసుములున్న విశ్వవిద్యాలయాల్లో మరో పీజీ చేస్తుంటారు. అమెరికాలో ప్రస్తుతం ఓపీటీ చేస్తున్న వారితో కలుపుకొని 2.10 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు.

  వారి జీతం ఏడాదికి రూ.41 లక్షలు

  * సీబీఐటీ నుంచి ఐదుగురు విద్యార్థుల ఎంపిక
  ఈనాడు, హైదరాబాద్‌: సీబీఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఏడాదికి రూ.41 లక్షల వేతనంతో మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌కు ఎంపికయ్యారు. ఇది 41 ఏళ్ల సీబీఐటీ చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ అని కళాశాల శిక్షణ, ప్రాంగణ నియామకాల అధిపతి డాక్టర్‌ ఎన్‌ఎల్‌ఎన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారిలో చంద్రమౌళి, వైష్ణవి పుల్లూరి, చింతా ప్రీతమ్‌, పి.అంకిత, కృష్ణ శ్రీ సోమేపల్లి ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 100 కంపెనీల్లో 1205 మంది ఉద్యోగాలకు, 400మంది ఇంటర్న్‌షిప్‌లకు ఎంపికయ్యారని తెలిపారు.

  నేటి బీటెక్‌ అమ్మాయిలే రేపటి టెక్‌ నిపుణులు

  * అల్పాదాయ వర్గాల నుంచే అధిక పోటీ
  * ప్రత్యేక శిక్షణకు వంద మంది ఎంపిక

  ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ పూర్తయిన అమ్మాయిలకు తాజా సాంకేతికతపై ఉమెన్‌ ఇంజినీర్స్‌(ఉయ్‌) పేరిట టాలెంట్‌ స్ప్రింట్‌ సంస్థ శిక్షణ ఇస్తోంది. దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 83 విశ్వవిద్యాలయాల పరిధిలోని 7,276 మంది పోటీపడ్డారు. వారిలో తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ నుంచి అధికంగా అభ్యర్థనలు అందాయి. వారిలో 100 మందిని ఎంపికచేశారు. దరఖాస్తుదారులను విశ్లేషించి, టెక్‌ కెరీర్‌పై వారి ఆకాంక్షలను విశ్లేషించారు. అమ్మాయిల్లో గ్లోబల్‌ టెక్‌ కెరీర్‌పై ఉన్న ఆకాంక్షకు, వారి తల్లిదండ్రుల విద్యానేపథ్యానికి ఎటువంటి సంబంధమూ లేదని తేలింది. తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారి నుంచే అధిక దరఖాస్తులు వచ్చాయంటే ఆ ఆదాయానికి, విద్యార్థినుల ఆకాంక్షలకు సంబంధం లేనట్లే. సంస్థ సీఈవో డాక్టర్‌ శంతను పాల్‌ మాట్లాడుతూ, చాలామంది ప్రతిభావంతులైన ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు తగినంత పాటవం ఉన్నా సరైన కెరీర్‌ మార్గదర్శకం లభించడం లేదన్నారు. అందుకే ఉయ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామన్నారు. వచ్చే మూడేళ్లలో 600 మంది బీటెక్‌ అమ్మాయిలను టెక్‌ నిపుణులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
  నివేదిక ముఖ్యాంశాలు
  * 7,276 మంది దరఖాస్తుదారుల్లో పరీక్ష రాసినవారు 3,075 మంది ఉన్నారు.
  * వారిలో 50 శాతం నగరాలు, 28 శాతం పట్టణాలు, 22 శాతం గ్రామాలకు చెందినవారు.
  * 33 శాతం మంది తమ కుటుంబాల నుంచి పట్టభద్రులైన మొదటి తరంవారే.
  * 83 శాతం మంది సంవత్సర కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువే.
  * పరీక్ష రాసినవారిలో 40 శాతం మంది ఛాలెంజింగ్‌ కోడ్‌ రీడింగ్‌ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణులయ్యారు.
  * పరీక్ష రాసిన ప్రతి ఐదుగురిలో ఒకరు ఉన్నత గ్లోబల్‌ కెరీర్‌ను చేరుకోగలిగే శక్తిసామర్థ్యాయలున్నవారు.

  ఇంజినీరింగ్‌కు అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి

  * సాంకేతిక విద్యపై బీవీఆర్‌ మోహన్‌రెడ్డి కమిటీ ప్రణాళిక
  ఈనాడు, హైదరాబాద్‌: ‘ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు బాగా పెరగాలన్నా, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవాలన్నా అప్రెంటిస్‌షిప్‌ను తప్పనిసరి చేయాలి. దీన్ని వచ్చే అయిదు సంవత్సరాల్లో అందరికీ పూర్తి శాతం అమలుచేయాలి’ అని ఐఐటీ హైదరాబాద్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ఉన్న బీవీఆర్‌ మోహన్‌రెడ్డి..అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి సూచించారు. దేశంలో ఇంజినీరింగ్‌ విద్య- ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలో సూచిస్తూ నివేదిక ఇవ్వాలంటూ ఆయన ఆధ్వర్యంలో కమిటీని ఏఐసీటీఈ నియమించింది. సూచనలను ఆమోదించింది.
  కమిటీ సూచనల్లో ముఖ్యమైనవి..
  * దేశవ్యాప్తంగా 2020 నుంచి కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదు. అదనపు సీట్లు మంజూరు చేయవద్దు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సీట్ల సంఖ్యపై ఏఐసీటీఈ సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి.
  * ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలు లేవంటే..అందులో అధ్యాపకుల పాత్ర కూడాఉంది. వారికి నాణ్యత అభివృద్ధి కార్యక్రమం (క్యూఐపీ)కింద ఐఐటీ, ఎన్‌ఐటీ ఆచార్యులతో శిక్షణ ఇప్పించాలి. ఉపాధ్యాయ విద్యపై సర్టిఫికెట్‌/డిప్లొమా/డిగ్రీ కోర్సు ఉండాలి.
  * పరిశ్రమలు- విద్యాసంస్థల మధ్య అనుసంధానం పెంచేందుకు ప్రయోగాత్మకంగా 20 నేషనల్‌ నాలెడ్జి ఫంక్షనల్‌ హబ్స్‌(ఎన్‌కేఎఫ్‌హెచ్‌) ఏర్పాటు చేయాలి.
  * ప్రస్తుతం పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌(ఏటీఎల్‌) పేరిట ప్రయోగశాలలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. అదే మాదిరిగా ప్రతి ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ ఉండాలి.
  * అంతటాకలిపి 437 పేర్లతో బీటెక్‌ కోర్సులు ఉన్నాయి. వాటిని 20 ప్రధాన కోర్సులుగా మార్చాలి.

  బీటెక్‌కు కొత్త రూపు

  * ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడు కొత్త బ్రాంచీలు
  * 13 కళాశాలల్లో పెరగనున్న సీఎస్‌ఈ, ఐటీ సీట్లు
  * తెలంగాణ‌లో దాదాపు 10 ఏళ్ల తర్వాత కొత్త కోర్సులు

  ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బీటెక్‌ స్థాయిలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) బీటెక్‌లో 60 బ్రాంచీలకుపైగా గుర్తింపు ఇస్తున్నా రాష్ట్రంలో ఆ సంఖ్య 30కి మించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త కళాశాలలు, కోర్సులు, సీట్ల పెంపునకు అనుమతించని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పచ్చజెండా ఊపింది. దానివల్ల కొత్తగా ఏడు బ్రాంచీలు రాబోతున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయి. కొన్ని బ్రాంచీల్లో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం కూడా కొత్తవాటికి అనుమతి ఇవ్వకూడదని భావించినా చివరి నిమిషంలో ప్రభుత్వం వాటికి అంగీకరించింది. దాంతో ఏడు రకాల కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి. మొత్తానికి కొత్త బ్రాంచీలు, సెక్షన్లు పెంచుకోవడం వల్ల దాదాపు 2,000 సీట్లు పెరగనున్నాయి. కొత్త కోర్సులు కాకున్నా విభిన్నంగా జేఎన్‌టీయూహెచ్‌లో 2009-10 విద్యా సంవత్సరం నుంచి అయిదేళ్ల ఇంటిగ్రేడెట్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాం (ఐడీపీ) పేరిట బీటెక్‌+ఎంటెక్‌/ బీటెక్‌+ ఎంబీఏ కోర్సులు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొత్త కోర్సులు రాలేదు.
  పెరిగే సీట్లు ఆ రెండు బ్రాంచీల్లోనే..
  తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా 183 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా వాటిలో 13 కళాశాలల్లో ఉన్న సీట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ని కళాశాలల్లో సీఎస్‌ఈ లేదా ఐటీ బ్రాంచీల్లోనే సీట్లు పెరుగుతున్నాయి. ఒక్కో బ్రాంచీలో 60 చొప్పున మొత్తం 780 సీట్లు పెరగనున్నాయి. సీఎస్‌ఈ, ఐటీలకే ఎక్కువ డిమాండ్‌ ఉందని అంచనాకు వచ్చిన కళాశాలలు ఆ రెండు బ్రాంచీల్లో సీట్ల పెంపునకే ప్రతిపాదనలు సమర్పించాయి. ఒక్కో బ్రాంచీలో రెండు సెక్షన్లు.. 120 సీట్లకు మించి ఇవ్వరాదని నిబంధన పెట్టుకున్నాం. ఆ మేరకు అనుమతి ఇచ్చామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదయ్య చెప్పారు.
  జేఎన్‌టీయూహెచ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ రద్దు
  జేఎన్‌టీయూహెచ్‌లో 2009లో ప్రవేశపెట్టిన అయిదేళ్ల బీటెక్‌+ఎంబీఏ కోర్సు ఈ విద్యా సంవత్సరం నుంచి రద్దు కానుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఎంసెట్‌ ప్రవేశాల కమిటీకి లేఖ అందజేసింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడున్నర సంవత్సరాల తర్వాత ఎంబీఏకి వెళ్తారు. వారికి బీటెక్‌, ఎంబీఏ ధ్రువపత్రాలు ఇస్తారు. అయితే దీనికి పెద్దగా డిమాండ్‌ లేకపోవడంతో దాన్ని రద్దు చేశారు.

  ఐటీ రంగంలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు

  * కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే
  దిల్లీ: నైపుణ్యాల సమగ్రాభివృద్ధి కార్యక్రమం ద్వారా ఐటీ రంగంలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్టు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే చెప్పారు. ‘వరల్డ్‌ స్కిల్‌ ఇండియా-ఇంటర్నేషనల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఛాలెంజ్‌ 2019’పై జులై 2న‌ ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసగించారు. 2018లో రూ.17,250 కోట్లున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగాన్ని డిజిటల్‌ సాంకేతిక సాయంతో 2022 నాటికి రూ.49,000 కోట్లకు తీసుకెళ్తామన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో వచ్చే రెండు మూడేళ్లలో కొత్తగా 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు నాస్కామ్‌ ఛైర్మన్‌ కేశవ్‌ మురుగేశ్‌ చెప్పారు.

  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఊరట

  * సాంకేతిక కళాశాలలకు సుప్రీం కొర‌డా
  * నియంత్రణ కమిటీదే నిర్ణయాధికారమని స్పష్టీకరణ
  * రుసుములపై మీ జోక్యమేంటని హైకోర్టుకు ప్రశ్న

  ఈనాడు - దిల్లీ, హైదరాబాద్‌: ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించింది. రుసుముల నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)దేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు పరిధికి మించి వ్యవహరించిందని అభిప్రాయపడింది. దీంతో ఇంజినీరింగ్‌ కళాశాలలకు సుప్రీం తీర్పు షాక్‌ ఇచ్చినట్లయింది. ఇక రాష్ట్రంలో కళాశాలలను కూడా కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  ఇదీ ఫీజుల పెంపు నేపథ్యం..
  ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, న్యాయవిద్య, ఎంబీఏ తదితర కళాశాలలకు ప్రతి మూడేళ్లకు ఒకసారి టీఏఎఫ్‌ఆర్‌సీ వార్షిక రుసుములను నిర్ణయిస్తుంది. ఆ కమిటీ 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు 2016 జులైలో రుసుములను ఖరారు చేసింది. అయితే అవి తమకు సమ్మతం కాదని, వాటిని పెంచాలని శ్రీనిధి, వాసవి, సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాలలు 2016లో హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని.. అయితే అది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2018లో తీర్పునిచ్చింది. ఆ కళాశాలల్లో భారీగా రుసుములు చెల్లించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనిధి, వాసవి కళాశాలల్లో పేరెంట్స్‌ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, పేరెంట్స్‌ అసోసియేషన్‌ రుసుములపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
  సుప్రీం ఏం చెప్పింది?
  ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏప్రిల్‌ 10న తీర్పు రిజర్వులో ఉంచగా.. జులై 1న‌ సుప్రీం జస్టిస్‌ నవీన్‌ సిన్హా తీర్పును వెలువరించారు. 'రుసుముల విషయంలో నియంత్రణ కమిటీ సిఫార్సుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్ణయం తీసుకొనే అంశంపైనే సమీక్ష ఉంటుంది కానీ తీసుకొన్న నిర్ణయంలో మెరిట్‌పైన కాదు. న్యాయ సమీక్ష పేరుతో రుసుముల నియంత్రణ కమిటీ పరిధిలోకి వెళ్లి కోర్టులు నిర్ణయం తీసుకోకూడదు. నిపుణుల కమిటీ సిఫార్సుల్లో జోక్యం చేసుకోకూడదు' అని స్పష్టం చేశారు. పేరెంట్స్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాది శ్రావణ్‌కుమార్‌, ప్రభుత్వం తరఫున న్యాయవాది వెంకటరెడ్డి, వాసవి కళాశాల తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ వాదనలు వినిపించారు. నియంత్రణ కమిటీ కాలపరిమితి ముగిసిందని.. ఆ కమిటీ నిర్ణయించిన రుసుముల వల్ల సంస్థ నష్టపోతుందని నారీమన్‌ కోర్టుకు తెలిపారు. అయితే హైకోర్టు నిర్ణయించిన రుసుములు ప్రతిబంధకంగా మారాయని పేరెంట్స్‌ అసోసియేషన్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రవేశాల రుసుముల నిర్ణయాధికారంలో హైకోర్టు జోక్యం తగదని, నియంత్రణ కమిటీదే తుది నిర్ణయమని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి వాదించారు. పేరెంట్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ప్రభుత్వం వాదనలు అంగీకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ ఆదేశాలిచ్చింది.
  ఇక అడ్డుకట్ట పడినట్లేనా!
  తాజా తీర్పుతో రుసుములను నియంత్రించడంలో టీఎఫ్‌ఆర్‌సీ మరింత కఠినంగా వ్యవహరించనుంది. టీఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన రుసుములను అంగీకరించని యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చాయి. ఇక నుంచి అలా చేసేందుకు కళాశాలలు వెనకడుగు వేస్తాయని చెబుతున్నారు. దాంతో ప్రతి మూడేళ్లకు భారీగా రుసుములను పెంచుకునేందుకు కళాశాలలకు అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  సుప్రీం ఉత్తర్వులను అమలు చేయాలి
  ఇంజినీరింగ్‌ ఫీజుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని పేరెంట్స్‌ కమిటీ జులై 1న‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డిని కలిసి విన్నవించింది. న్యాయస్థానం తీర్పును సంపూర్ణంగా అమలు చేయాలని కమిటీ ప్రతినిధులు డా.వంగూరి మద్దులేటి, ఎన్‌.నారాయణ, శ్రీనాథ్‌, సురేష్‌ తదితరులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
  మాకు కూడా స్పష్టత వచ్చింది - తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, కమిటీ సభ్యుడు తుమ్మల పాపిరెడ్డి
  ‘టీఏఎఫ్‌ఆర్‌సీ మాత్రమే రుసుములను నిర్ణయిస్తుందని.. తుది నిర్ణయం ఆ కమిటీదేనిని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో మాకు స్పష్టత వచ్చింది. వేలమంది విద్యార్థులకు ఊరట కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది’
  అన్ని వృత్తి విద్యా కళాశాలలకూ ఇదే తీర్పు - ఓ ఉన్నతాధికారి
  ఇప్పటివరకు న్యాయస్థానాలకు వెళ్లి ఎన్నో న్యాయ విద్య కళాశాలలు కూడా రుసుములను రెట్టింపు వసూలు చేశాయి.. వాటిపై కూడా దృష్టి సారిస్తాం. కేవలం ఇంజినీరింగ్‌ కళాశాలలకే కాదు.. అన్ని వృత్తి విద్యా కళాశాలలకు ఈ తీర్పు వర్తిస్తుంది.

  15 శాతం వరకే ఫీజుల పెంపు!

  * ఇంజినీరింగ్‌ రుసుముల ఖరారుపై నియంత్రణ కమిటీ విచారణ
  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల రుసుములను నిర్ణయించడానికి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు మొదలు పెట్టింది. ఎంసెట్‌ ఆప్షన్ల ప్రక్రియ జులై 5 నుంచి ప్రారంభమవుతుందని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. తాము ప్రతిపాదించిన రుసుములను ఖరారు చేయాలని హైకోర్టుకు వెళ్లిన 81 కళాశాలలకు వచ్చే మూడేళ్లకు శాశ్వత రుసుములను ఖరారు చేసేందుకు కమిటీ విచారణ సాగిస్తోంది. జులై 1న‌ 20 కళాశాలల యజమానులను పిలిచి తాము నిర్ణయించిన రుసుముల గురించి వివరించింది. అనురాగ్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ నిర్ణయించిన రుసుములకు అంగీకరించి సంతకాలు చేసినట్లు తెలిసింది. ఏ కళాశాలకైనా పెరుగుదల 15 శాతంలోపే ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుం రూ.50 వేలు ఉంటే దానిపై 20 శాతం, రూ.50 వేలు దాటితే దానిపై 15 శాతాన్ని తాత్కాలికంగా పెంచుతామని జూన్‌ 29న టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించి ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో టీఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుపై అభ్యంతరాలుంటే కళాశాలలు అప్పీల్‌ చేసుకోడానికి రూ.10 వేల రుసుం ఉండేది. ఈసారి ఆ రుసుమును రూ.లక్షకు పెంచింది. సుప్రీం తాజా తీర్పుతో చాలావరకు కళాశాలలు కమిటీ ప్రతిపాదించిన రుసుములకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

  బీటెక్‌ కృత్రిమ మేధ సీట్లు అందుబాటులోకి

  * దేశంలో తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్‌లో కోర్సు
  ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా బీటెక్‌ స్థాయిలోనే కృత్రిమ మేధపై కోర్సును ప్రారంభిస్తామని ప్రకటించిన ఐఐటీ హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి 21 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. జూన్‌ 16వ తేదీ నుంచి ప్రారంభమైన జోసా కౌన్సెలింగ్‌ ద్వారా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుల ఆధారంగా వాటిని భర్తీ చేయనున్నారు. ఇన్ఫోటెక్‌ అధినేత బీవీఆర్‌ మోహన్‌రెడ్డిని ఛైర్మన్‌గా ఇంజినీరింగ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థ (ఏఐసీటీఈ) ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. శరవేగంగా సాంకేతికత మారుతున్న నేపథ్యంలో కొత్త టెక్నాలజీలపై బీటెక్‌ స్థాయిలోనే దృష్టి కేంద్రీకరించాలని ఆయన సిఫారసు చేశారు. ఐఐటీ హైదరాబాద్‌ పాలకమండలికి ఆయన ఛైర్మన్‌ కావడం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా బీటెక్‌ కృత్రిమ మేధ కోర్సును ప్రారంభిస్తామని కొద్ది నెలల క్రితం ఐఐటీ హైదరాబాద్‌ ప్రకటించింది. దాన్ని అందుబాటులోకి తెచ్చిన ఐఐటీ...మొత్తం 21సీట్లతో కోర్సును ప్రారంభించింది. వాటిల్లో జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కింద ఒక సీటు కేటాయించారు. ప్రస్తుతం కృత్రిమ మేధకు మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో ఈ సీట్లకోసం అధిక పోటీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  ఇంజినీరింగ్‌ సీట్లు 1.53 లక్షలు

  * ప్రైవేటు కళాశాలల్లో 1.40 లక్షలు
  * వర్సిటీల్లో 3,670 సీట్లు
  * అనుమతులు మంజూరు చేసిన ఏఐసీటీఈ

  ఈనాడు - అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2019-20 విద్యాసంవత్సరానికి విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీల్లో 302 ఇంజినీరింగ్‌, 127 ఫార్మ కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసింది. ఈ కళాశాలల్లో మొత్తం 1,53,331 ఇంజినీరింగ్‌ సీట్లు, 11,139 ఫార్మ సీట్లకు ఆమోదం తెలిపింది. డీమ్డ్‌ వర్సిటీలు, రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం కళాశాలల్లో సీట్లను అయా సంస్థలే భర్తీ చేసుకుంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీ కళాశాలల్లో సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా నింపనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం 1,40,763 సీట్లలో 70శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. గతేడాది (2018-19) ఇంజినీరింగ్‌లో 1,56,166 సీట్లుండగా ఈసారి 2,835 తగ్గాయి. గతేడాది 305 కళాశాలలకు.. ఈసారి 302 కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీల్లో 1,098 ఇంజినీరింగ్‌ సీట్లకు ఆమోదం తెలిపింది.
  ఇక ఫలితాలే ఆలస్యం
  ఇప్పటికే ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి లభించిన నేపథ్యంలో ఇక ఎంసెట్‌ ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది ఫలితాలను గడువులోపు విడుదల చేయడంతో ఏఐసీటీఈ అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది అది పూర్తి భిన్నంగా మారింది. తెలంగాణలో ఇంటర్‌ మార్కుల గందరగోళం కారణంగా ఫలితాల విడుదలలో జాప్యం ఏర్పడింది.
  ఈ ఏడాది కొత్త కళాశాలలు
  * కర్నూలులో రాయలసీమ వర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించారు. దీనికి ఏఐసీటీఈ అనుమతి లభించింది. ప్రాథమికంగా 2,40 సీట్లకు ఆమోదం తెలిపింది.
  * ప్రకాశం జిల్లాలో వేదా ఫార్మసీ కళాశాలలకు ఈ ఏడాది 60 సీట్లు మంజూరయ్యాయి.
  * తూర్పుగోదావరిలోని కైట్స్‌ మహిళా ఫార్మసీ కళాశాలకు 100 సీట్లు కేటాయించింది.
  డీమ్డ్‌ వర్సిటీలకు ఇలా..
  * గీతం, కేల్‌యూ, విజ్ఞాన్‌ డీమ్డ్‌ వర్సిటీలకు ఇంజినీరింగ్‌లో 7,800 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి తెలిపింది.
  * మూడు వర్సిటీల్లో ఫార్మసీ సీట్లు 260 మంజూరు చేసింది.
  డిప్లామా సీట్లు
  పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లకు ఏఐసీటీఈ అనుమతి తెలిపింది. 84 ప్రభుత్వ, 2 ఎయిడెడ్‌, 197 ప్రైవేటు కళాశాలలకు ఆమోదం లభించింది. వీటిల్లో 69,874 సీట్లు మంజూరు చేసింది. కొత్తగా విజయనగరం, ప్రకాశం జిల్లాలకు పాలిటెక్నిక్‌లు వచ్చాయి. కేంద్ర ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక సంస్థకు 240సీట్లు మంజూరయ్యాయి.

  తగ్గుతున్న ఇంజినీరింగ్‌ ప్రవేశాలు

  * భర్తీ అవుతున్నవి 56.24 శాతం సీట్లే
  * నాణ్యమైన విద్య అందడంలేదని ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్న విద్యార్థులు

  ఈనాడు - అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఓ వైపు ఇంజినీరింగ్‌ సీట్లకు కోతపడుతుండగా.. మరోవైపు వీటిల్లో ప్రవేశాలు గణనీయంగా పడిపోతున్నాయి. 2014-15లో 1.84 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు ఉండగా గతేడాది ఈ సంఖ్య 1.56 లక్షల సీట్లకు తగ్గిపోయింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతుల నిబంధనలను కఠినతరం చేయడం, డిమాండ్‌ లేని కోర్సులను కళాశాలలు స్వచ్ఛందంగా వదులుకోవడం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గి కొన్ని కళాశాలలు మూతపడడంతో సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. మరోవైపు సీట్ల భర్తీ దారుణంగా ఉంటోంది. మొత్తం సీట్లలో భర్తీ అవుతున్నది 56.24 శాతానికి మించడం లేదు. ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుకు గతంలో భారీగా అనుమతులు ఇచ్చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని కళాశాలల్లో గతేడాది కన్వీనర్‌ కోటా ప్రవేశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
  ఉద్యోగాలు కొంత ఆశాజనకం
  ఇంజినీరింగ్‌లో చేరుతున్న వారిలో ఉద్యోగాలు లభిస్తున్న వారి సంఖ్య గత నాలుగేళ్లతో పోల్చితే 2018-19లో కొంత మెరుగుపడింది. 2014-15లో మొత్తం ప్రవేశాల్లో ఉద్యోగాలు లభించిన వారి సంఖ్య 34.68శాతంగా ఉండగా.. ఇది గతేడాదికి 49.90శాతానికి పెరిగింది. కంపెనీల అవసరాలకు తగినట్లు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తుండడంతో కొంతవరకు ఉపాధి అవకాశాలు మెరగవుతున్నాయి. ఏపీలో కళాశాలల యాజమాన్యాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణలు విరివిగా నిర్వహిస్తున్నాయి.
  ఇదీ పరిస్థితి..
  గతేడాది కన్వీనర్‌ కోటాలో 1 - 10 సీట్లు భర్తీ అయిన కళాశాలు 20 ఉండగా.. 11 - 20 సీట్లు భర్తీ అయినవి 15 వరకు ఉన్నాయి. 401 - 500 మంది విద్యార్థులు చేరిన కళాశాలలు 16 మాత్రమే ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో నాణ్యమైన విద్య అందడంలేదనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌లాంటి రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. స్థానికంగా ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలో చేరుతున్నారు. విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ఒక పక్క ఏఐసీటీఈ సీట్లలో కోత వేస్తుండగా.. మరోపక్క మంజూరైన సీట్లు భర్తీకాని పరిస్థితి నెలకొంది.

  ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గుతున్నాయ్‌

  * దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
  * 2014-15 నుంచి 4.54 లక్షల సీట్ల తగ్గుదల
  * తెలంగాణలో లక్ష.. ఏపీలో 35 వేలు

  ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో ఇంజినీరింగ్‌ సీట్లు, కళాశాలలు ఏటేటా తగ్గిపోతున్నాయి. చేరే వారు మితంగా ఉంటుండడంతో యాజమాన్యాలు సైతం స్వయంగా సీట్లకు కోత పెట్టుకుంటున్నాయి. గత ఆరు సంవత్సరాల్లో చూస్తే 4.54 లక్షలకుపైగా సీట్లు తగ్గాయి. ఒక్క తెలంగాణలోనే లక్షకుపైగా సీట్లకు గండిపడింది. ఏపీలోనూ 35 వేల సీట్లు తగ్గిపోయాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం రావడంతో 2004-2008 మధ్య అధిక సంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలు పుట్టుకొచ్చాయి. కొన్నేళ్లుగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారీగా సీట్లను పెంచుకున్న కళాశాలలు తగ్గించుకునే పనిలో పడ్డాయి.
  అలాగే మొత్తం సీట్లలో 30 శాతం సీట్లు భర్తీకాని కళాశాలలను సీట్లు తగ్గించుకోమని అఖిల భారత సాంకేతిక విద్యామండలి చెబుతూండటం కూడా ఒక కారణం. మరోపక్క కళాశాలలు డిమాండ్‌లేని కోర్సులను తగ్గించుకుంటూ విద్యార్థులు కోరుకుంటున్న ఐటీకి సంబంధించిన సీట్లను, కోర్సులను పెంచుకుంటున్నాయి. కనీస ప్రమాణాలు లేని కళాశాలలు మూతపడుతున్నాయి. 2014-15 విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే 2019-20 నాటికి 366 కళాశాలలు తగ్గిపోయాయి.

  ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మార్పులు

  * విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట
  * పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

  ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో 97 శాతం మంది సాఫ్ట్‌వేర్‌, అనుబంధ ఉద్యోగాల్లో ప్రవేశించాలని కోరుకుంటున్నారు. వారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందేందుకు పూర్తిస్థాయి అర్హతలు కలిగి ఉన్నారు. ఏడు శాతం మంది మాత్రమే ఈ వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు కలిగి వాటిని నిర్వహించగల స్థాయిలో ఉన్నారు.
  - 2013లో ఒక అధ్యయనం వెల్లడించిన విషయం
  దేశంలో ఏటా 10 లక్షల మంది వరకూ ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలో రెండో స్థానం మనదే. మరి ఉద్యోగాల మాటేమిటి? అంటే తటపటాయించాల్సిన పరిస్థితి! ఉదాహరణకు 2017-18లో దేశవ్యాప్తంగా భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలో 13.4 లక్షల మంది డిప్లొమా, ఇంజినీరింగ్‌, ఎంటెక్‌, ఫార్మసీ, ఎంసీఏ ఉత్తీర్ణులై బయటకు రాగా.. వీరిలో 6.5 లక్షల మంది మాత్రమే ప్రాంగణ నియామకాలు పొందారు.
  ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో అనేక మందికి తాము చదివిన కోర్సుకు సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన, ఆచరణాత్మక పరిజ్ఞానం (ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌) లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దీంతో వీరిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విజన్‌-2025తో ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది. ప్రత్యేక కథనం
  పరిశ్రమవంతులను చేద్దాం
  ఇంజినీరింగ్‌ విద్యార్థులను పరిశ్రమవంతులుగా తీర్చిదిద్దేందుకు భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అడుగులు వేస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటా పాఠ్యాంశాల్లో మార్పులు చేయటంతో పాటు.. చదువు పూర్తయ్యేలోగా క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కలిగించటం వరకూ అన్ని దశల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తోంది. వారిలో నైపుణ్యాలను మెరుగు పరిచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏఐసీటీఈ విజన్‌-2025ను ప్రకటించింది.
  కల్పించే సౌకర్యాలు
  * లక్ష అంకుర సంస్థల అభివృద్ధి
  * ప్రతి కళాశాల కనీసం ఐదు పరిశ్రమలతో అనుసంధానం కావడం
  * ప్రపంచస్థాయి కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటు
  * కళాశాలల్లో ప్రత్యేకంగా పరిశోధన, ఆవిష్కరణల (ఇన్నోవేషన్‌) సెల్‌ ఏర్పాటు
  * అధ్యాపకుల సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలపై పరిశీలన.
  ప్రస్తుత పరిస్థితి..
  ఇంజినీరింగ్‌ కళాశాలలు భారీగా పెరిగిపోవడం, అందరికీ ఉద్యోగాలు లభించకపోవడం ఈ రంగంపై ప్రభావం చూపుతోంది. నాణ్యత లేని కళాశాలలు మూతపడుతున్నాయి. జాతీయ స్థాయిలో సాంకేతిక విద్య పూర్తి చేస్తున్న వారిలో సగం కంటే తక్కువ మందికే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
  విజన్‌ - 2025 లక్ష్యాలు
  * పాఠ్యాంశాల్లో మార్పులు, అతిథి అధ్యాపకులు, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాంగణ నియామకాలు.. అన్నింట్లో పరిశ్రమలను భాగస్వాములను చేయడం.
  * కళాశాల, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేలా సమర్థ పరిశోధన కేంద్రాల ఏర్పాటు. మంచి పరిశోధనలకు ప్రోత్సాహకాలు.
  * విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సులు ప్రవేశపెట్టడం. పారిశ్రామికవేత్తలతో బోధన. పరిశ్రమల పర్యవేక్షణలో ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు.
  * అంతర్జాతీయ విద్యా సంస్థలతో విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి (స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజి) కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం.
  ప్రపంచవ్యాప్తంగా ఇలా
  ప్రపంచ ఆర్థిక వేదిక-2015, యునెస్కో గణాంక సంస్థ ప్రకారం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్న వారు చైనా తర్వాత భారత్‌లోనే అధికంగా ఉన్నారు.
  పరిశ్రమల అవసరాలివీ..
  * కోర్సు ప్రాథమిక అంశాలపై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశంతో పాటు సాంకేతికంగా వస్తున్న మార్పులపై అధ్యయనం.. అంకితభావం, నిలకడ, సానుకూల దృక్పథం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
  * ప్రతి ఉద్యోగి కొత్తగా ఆలోచించడం, మూస పద్ధతికి భిన్నంగా వ్యవహరించటం, విశ్లేషణ శక్తి కలిగి ఉండాలని పరిశ్రమల యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.

  అందుబాటులోకి ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌

  ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఇందులో తమ కళాశాల వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అధ్యాపకులు, విద్యా సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 136 కోర్సులకు సంబంధించి ఇంటర్న్‌షిప్‌ కోసం కంపెనీల సమాచారాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఆయా కంపెనీలు అందించే ఉపకార వేతనం, కోర్సు సమయం, ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను పొందుపర్చారు. ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులను ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంజినీరింగ్‌ విద్యార్థులు 2, 4, 6, 8 సెమిస్టర్లలో ఎప్పుడైనా ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చు. 2, 8 సెమిస్టర్లలో 3 నుంచి 4 వారాలు; 4, 6 సెమిస్టర్లలో 4 నుంచి 6 వారాలు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ పూర్తి చేసిన బీటెక్‌ విద్యార్థులకు 14 నుంచి 20 క్రెడిట్లు ఇస్తారు.

  ఏపీ విట్‌లో కౌన్సెలింగ్‌ ప్రారంభం

  తుళ్ళూరు, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్‌తో విట్‌(ఏపీ) విశ్వవిద్యాలయం కళకళలాడింది. రాజధాని అమరావతిలోని విట్‌లో మే 9న‌ వెల్లూరు క్యాంపస్‌కు సంబంధించిన ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. దీన్ని ప్రారంభించిన అనంతరం విశ్వవిద్యాలయం వైస్‌ ప్రెసిడెంట్‌ శంకరవిశ్వనాథన్‌ మాట్లాడుతూ.. అమరావతి, వెల్లూరు, చెన్నై, భోపాల్‌ క్యాంపస్‌ల్లోని వివిధ బ్రాంచిలకు ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విట్‌లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాకు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 మంది విద్యార్థులకు ఈ వెసులుబాటు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సీఎల్‌వీ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  వేసవిలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

  ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 59 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డసాల్ట్‌ సిస్టమ్స్‌ సహకారంతో మే 13 నుంచి 30 రోజుల పాటు ఉత్తమ శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో అర్జా శ్రీకాంత్‌ ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి డసాల్ట్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రులతో పాటు ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వారు సైతం వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 1800 425 2422 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
  https://to.ly/1yYzH